Saturday, November 21, 2009

ఏక వింశతి లక్ష మహా గణపతి నామ జప యజ్ఞం


వేలాది భక్తుల, ఆస్తికుల సహకారంతో వేద భారతి తలపెట్టిన వేలాది భక్తుల, ఆస్తికుల సహకారంతో వేద భారతి తలపెట్టిన ఏక వింశతి లక్ష మహా గణపతి నామ జప యజ్ఞం 2010 జనవరి 31న (ఆదివారం) ప్రారంభమవుతుంది. నూతన సంవత్సరాది అయిన 2010 ఫిబ్రవరి 1న (సోమవారం) కూడా కొనసాగుతుంది. మహా గణపతి జయంతి అయిన మాఘ బహుళ చవితి (సంకష్ఠ హర చవితి - మంగళవారం) ఫిబ్రవరి 2న పూర్ణాహుతితో పరిసమాప్తమవుతుంది.
ఈ యాగానికి సహకరించదలచిన వారు, గోత్ర నామాదులతో గణపతి హోమం చేయించుకోదలచినవారు వేద భారతి సమన్వయ కర్తల్ని సంప్రదించవచ్చు.

వేదభారతి కరపత్రాన్ని ఆవిష్కరించిన మల్లాది
భారతీయత పరిరక్షణకు కృషి చేయాలని పిలుపు

హైదరాబాద్, జూలై 8:
ఒకప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారతీయ ధర్మం, విలువలు క్రమేపి కనుమరుగవుతున్నాయని ప్రముఖ పౌరాణికులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. 'వేదభారతి' స్వచ్ఛంద ధార్మిక సేవా సంస్థ కరపత్రాన్ని బుధవారం తన నివాసంలో మల్లాది ఆవిష్కరించారు. 'మన దేశం కోసం... మన ధర్మం కోసం' నినాదంతో 'వేదభారతి' సంస్థ భారతీయత పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. "బ్రిటిష్ వారు మనల్ని వదలిపోయినా వారి వ్యాపారాత్మకత మనల్ని వీడిపోలేదు. మన విలువలకు చెదలు పడుతోంది. సంప్రదాయాలు ప్రమాదంలో పడుతున్నాయి. మనుగడ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిరక్షించుకునే ప్రయత్నం ఒకరకంగా ఎదురీతే! అయినా కలసికట్టుగా ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదు." అని ఆయన ఉద్ఘాటించారు.
వారసత్వ విలువల్ని పరిరక్షించుకోవడానికి యువత నడుం కట్టాలని ఉద్భోదించారు."వైదిక విజ్ఞానం మాయమవుతోంది. ఆయుర్వేదం లాంటి అద్భుత వైద్య విధానాలు పోతున్నాయి. క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థ తరంగాలు వెతికినా కనబడే పరిస్థితి లేదు.కనుమరుగవుతున్న మన భాషా సంస్కృతుల్ని, కళల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది." అని ఆయన పిలుపునిచ్చారు.
ప్రమాదంలో పడిన భారతీయ విలువలకు ప్రజల సహకారంతో కృషి చేయడమే వేదభారతి లక్ష్యమని సంస్థ సమన్వయకర్తలు వివరించారు. ఈ బృహత్తర లక్ష్యానికి ఔత్సాహికుల్ని సమాయత్తం చేసే లక్ష్యంతో వేదభారతి సంస్థ అధ్వర్యంలో తొలుత ఏకవింశతి లక్ష (21 లక్షల) మహాగణపతి నామ జప యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వివరాల కోసం 94405 46238, 99664 03921 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు